విడుదల తేదీ : 1 అక్టోబర్ 2014 TeluguArea.com : 4.0/5 దర్శకుడు : కృష్ణవంశీ నిర్మాత : బండ్ల గణేష్ సంగీతం : యువన్ శంకర్ రాజా నటీనటులు : రామ్ చరణ్, కాజల్, శ్రీ కాంత్, కమలినీ ముఖర్జీ..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 7 సినిమాల ప్రయాణంలో ఫ్లాప్స్ కంటే బ్లాక్ బస్టర్ హిట్సే ఎక్కువ. ఇప్పటి వరకూ వరుసగా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్స్ తో వరుస హిట్స్ అందుకున్న రామ్ చరణ్ మొదటి సారిగా యాక్షన్ అనేది పూర్తిగా పక్కనబెట్టి చేసిన పూర్తి కుటుంబ కథా చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. దసరా కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ స్పెషలిస్టు అయిన కృష్ణవంశీ దర్శకత్వం వహించాడు. కాజల్ అగర్వాల్, శ్రీ కాంత్, ప్రకాష్ రాజ్, కమలినీ ముఖర్జీ, జయసుధ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాని బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో కూడా హిట్ అందుకుంటానని నమ్మకంగా ఉన్న చరణ్ కి మరియు తెలుగు సినిమా చరిత్రలో పదికాలాల పాటు నిలిచిపోయేలా ఈ సినిమా ఉంటుందని నమ్ముతున్న బండ్ల గణేష్ ల నమ్మకాన్ని నిలబెట్టేలా ఈ సినిమా ఉందా.? లేదా.? అనేది ఇప్పుడు చూద్దాం…
కథ :
చిన్నప్పటి నుంచి లండన్ లోనే పుట్టి పెరిగిన ఇండియా కుర్రాడు అభిరామ్(రామ్ చరణ్). అభిరామ్ మన పని మనమే చేసుకోవాలి – మన కుటుంబాన్ని మనమే కలుపుకుపోవాలి అనే సిద్దాంతాన్ని నమ్ముతాడు. అలాగే అభిరామ్ పెరిగింది లండన్ లోనే అయినా భారతదేశ ఆచార సాంప్రదాయాలు అంటే చాలా ఇష్టం. ఒకరోజు తన తండ్రి ద్వారా తన ఫ్యామిలీ మూలాల గురించి తెలుసుకున్న అభిరామ్ తండ్రి బాధని తీర్చి, ఆ కుటుంబంలో తాము కలిసిపోవాలని ఇండియాకి వస్తాడు.
అలా వచ్చిన అభిరామ్ తన గ్రామం కోసం ఏమన్నా చేయాలనుకునే బాలరాజు (ప్రకాష్ రాజ్) కుటుంబంలోకి ఎంటర్ అవుతాడు. అలా ఎంటర్ అయిన అభిరామ్ ఆ కుటుంబంలో నేనూ ఒకడిని అని చెప్పకుండా వారందరితో ఎలా కలిసిపోయాడు.?? అందుకోసం ఏమేమి చేసాడు.? చివరికి తను ఆ ఇంటి వారసుడే అని తెలిసినప్పుడు బాలరాజు ఎలా రియాక్ట్ అయ్యాడు.? అసలు అభిరామ్ తెలుసుకున్న తన తండ్రి గతం ఏమిటనేది.? మీరు వెండితెరపైనే చూడాలి…
ప్లస్ పాయింట్స్ :
మన తెలుగువారి మిస్ అవుతున్న కుటుంబ బాంధవ్యాల విలువని తెలుపుతూ ఇలాంటి ఓ అచ్ఛ తెలుగు దృశ్య కావ్యాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని సంకల్పించిన కృష్ణవంశీకి, దాన్ని ఒకే చేసి చేసిన రామ్ చరణ్ కి, వీరిద్దరికీ వెన్నెముకలా ఉండి గ్రాండ్ లెవల్లో ఈ సినిమా తీసిన బండ్ల గణేష్ కి ముందుగా మేము హ్యాట్సాఫ్ చెబుతున్నాం.
రామ్ చరణ్ మొదటి సారి చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా ఎలా నటించాడో.? అని అనుకొని థియేటర్స్ కి వెళ్ళే ప్రతి ఒక్కరినీ చరణ్ తన అద్భుతమైన నటనతో సర్ప్రైజ్ చేస్తాడు. రామ్ చరణ్ ఇప్పటి వరకూ చేసిన సినిమాల పెర్ఫార్మన్స్ అంతా ఒక ఎత్తైతే, ఇందులో పెర్ఫార్మన్స్ మాత్రమే ఒక ఎత్తని చెప్పాలి. నటుడిగా చరణ్ ని ఉన్నత స్థాయిలో నిలబెట్టే సినిమా అవుతుంది. సినిమా మొత్తం తన నటనతో అందరినీ కట్టి పడేస్తాడు. రామ్ చరణ్ నటన చూసి ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోతారు. ముఖ్యంగా చివరి 30 నిమిషాల్లో చరణ్ చేసిన ఎమోషనల్ సీన్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్’ అనే చెప్పాలి. అలాగే తను చూపించిన సరికొత్త మానరిజమ్స్, గెటప్, కాస్ట్యూమ్స్ వెస్ట్రన్ మిక్స్ చేసిన కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి, అన్నిటికంటే ముఖ్యంగా పోనీ టెయిల్ లుక్ లో చరణ్ చాలా బాగున్నాడు. ఈ సినిమాలో సింపుల్ సింపుల్ స్టెప్స్ తో కూడా ఆకట్టుకున్నాడు.
కాజల్ అగర్వాల్ కూడా ఇది వరకూ కనిపించిన సినిమాలకు పూర్తి భిన్నంగా తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో ఆడియన్స్ మతి పోగొట్టింది. మామూలుగా చీరకి అమ్మాయిలోని ఏమేమి చూపించాలి ఏమేమి చూపించకూడదో తెలుసంటారు. అలానే కాజల్ కూడా ఆకట్టుకోవాల్సిన చోట అందంతో, మిగిలిన చోట అభినయంతో ఆకట్టుకుంది. కాజల్ మునుపెన్నడూ చూడని అందంగా, అంతే గ్లామరస్ గా ఇందులో కనిపిస్తుంది. ‘రా రా కుమారా’ పాటలో అల్ట్రా గ్లామరస్ గా కనిపించి ఆడియన్స్ ని కన్నార్పకుండా చేసింది. అలాగే మిగిలిన పాటల్లో కూడా కనురెప్ప వేస్తె ఎక్కడ కాజల్ అందాన్ని మిస్ అయిపోతామో అనే రీతిలో కృష్ణవంశీ కాజల్ ని చూపించాడు. ముఖ్యంగా గత రెండు సినిమాల్లో కన్నా ఈ సినిమాలో ఎక్కువగా రామ్ చరణ్ – కాజల్ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది. బావా మరదళ్ళు గా వీరి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ఆడియన్స్ లో ఏదో తెలియని ఫీలింగ్స్ ని కలిగిస్తాయి.
ఇక ఈ సినిమాకి ఆయువుపట్టుగా నిలిచిన ప్రకాష్ రాజ్ శ్రీ కాంత్ జయసుధల గురించి చెప్పాలి. ఈ చిత్ర టీం చెప్పినట్లు తాతయ్య పాత్రలో ప్రకాష్ రాజ్ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యాడు. తనే లేకపోతే ఏదో వెలితి కనిపించేది. గత కొద్ది సినిమాల నుంచి రెగ్యులర్ పాత్రల్లో కనిపిస్తున్న ప్రకాష్ రాజ్ ఈ మూవీతో పెర్ఫార్మన్స్ పరంగా మరోసారి తన టాలెంట్ ఏంటనేది చూపించాడు. నానమ్మగా జయసుధ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడమే కాకుండా, మంచి సపోర్ట్ ఇచ్చింది. అలాగే చరణ్ – ప్రకాష్ రాజ్ సీన్స్ సింప్లీ సూపర్బ్. ఇక విలేజ్ లో ఆవారాగా తిరుగుతూ రౌడీలా కనిపించే శ్రీ కాంత్ పాత్ర చాలా ఫన్నీగా ఉంటుంది. తను మాత్రమే ఆ పాత్ర చేయగలడు అనేంతలా చేసాడు. కమలినీ ముఖర్జీ కూడా లంగా ఓనీల్లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చరణ్ ఫాదర్ పాత్రలో రెహమాన్ నటన బాగుంది. ఎమోషనల్ సీన్స్ లో ఆ పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది.
ఆదర్శ్ బాలకృష్ణ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చాలా బాగా చేసాడు. అలాగే రావు రమేష్, కోట శ్రీనివాస రావు నెగటివ్ షేడ్స్ లో మంచి నటనని కనబరిచారు. కృష్ణవంశీ అంటే పాటలు అద్భుతంగా తీస్తాడనే పేరుంది, ఆ పేరుని మరో రెండింతలు పెంచేలా ఈ సినిమాలో పాటలని తీసారు. ఫస్ట్ హాఫ్ మొత్తం అలా అలా సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్ కూడా ఎంటర్టైనింగ్ గా మొదలై మీ మనసుకు హత్తుకునే ఎమోషనల్ సీన్స్ తో సినిమాని ముగించారు. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ చివరి 30 నిమిషాలు. మొదటి నుంచి సినిమాలోని పాత్రలకి మిమ్మల్ని కనెక్ట్ చేసెయ్యడం వలన చివరి 30 నిమిషాలు మీకే అలా జరుగుతున్నట్టు ఫీలవుతారు. సినిమా చివర్లో మీ కళ్ళు చెమర్చిన తర్వాత మీ మదిలో మెదిలే మొదటి ఆలోచన ‘ఒక్కసారి నా కుటుంబంలోని అందరితో కలిసి ఈ దసరా సెలబ్రేట్ చేసుకోవాలి’
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అక్కడక్కడా కాస్త స్లో అనిపిస్తుంది. దానికి కారణం ఆ ప్లేస్ లో కామెడీ లేకపోవడం. ఉన్న లెంగ్త్ పెంచకుండా ఫస్ట్ హాఫ్ మరియు సెకండాఫ్ మొదట్లో ఇంకాస్త కామెడీ డోస్ పెంచుంటే బాగుండేది. శ్రీ కాంత్ – కమలినీ ముఖర్జీలకి ఒకరంటే ఒకరికి ఇష్టం అనేలా సీన్స్ డిజైన్ చేసారు కానీ వారిద్దరి మధ్య ఒక్క 5 నిమిషాల లవ్ ట్రాక్ అన్నా ఉండి ఉంటే బాగుండేది. అలాగే శ్రీ కాంత్ పాత్ర ఒక రౌడీలా ఎందుకు బిహేవ్ చేస్తున్నది అన్న దానికి జస్టిఫికేషన్ ఇవ్వలేదు. సినిమాలో డిజైన్ చేసుకునే నెగటివ్ పాత్రలని ఇంకాస్త స్ట్రాంగ్ గా డిజైన్ చేసుకోవాల్సింది. అలాగే కథ పాత ఫార్మాట్ అని కొంతమందికి అనిపించవచ్చు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగంలో డిస్టింక్షన్ లో పాస్ అయిన వారు చాలా మందే ఉన్నారు.. ఒక్కొక్కరిగా చెప్పుకోస్తాను.. వీరందరూ పర్ఫెక్ట్ గా చేసి ఉండకపోతే ఈ రేంజ్ లో ఈ సినిమా వచ్చి ఉండేది కాదు. ముందుగా కెప్టెన్ అఫ్ ది షిప్ అయిన కృష్ణవంశీ గురించి చెప్తా – ఫస్ట్ కృష్ణవంశీ ఇస్ బ్యాక్ అని చెప్పాలి. మరోసారి అచ్చతెలుగు కథతో, మనసుకు ఆనందాన్ని కలిగించే కుటుంబ బాంధవ్యాలను బాగా చూపించాడు. రామ్ చరణ్ ని సరికొత్తగా ప్రెజెంట్ చెయ్యడంలో నటీనటుల నుంచి నటనని రాబట్టుకోవడంలో 100% సక్సెస్ అయ్యాడు. తన టాలెంట్ ఏంటనేది మరోసారి ఈ గోవిందుడు అందరివాడేలే నిరూపించుకున్నాడు. కృష్ణవంశీ మొదటగా థాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్ళు ఇద్దరు వల్లే సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ అశోక్.. కృష్ణవంశీ ఊహించుకొని చెప్పిన దాన్ని వీళ్ళు అద్భుతంగా చూపించారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా గ్రాండ్ గా ఉంది. ఫస్ట్ ఫ్రేం నుంచి చివరి ఫ్రేం వరకూ తన కలర్ఫుల్ విజువల్స్ తో మన ఇంట్లో మనం పండుగ చేసుకుంటున్నాం అనే ఫీలింగ్ ని కలిగించాడు. ఇక అశోక్ వేసిన సెట్టింగ్స్ అదిరిపోయాయి. ప్రతి ఫ్రేం నిండుగా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు.
వీరందరి ఆన్ స్క్రీన్ విజువల్స్ కి ప్రాణం పోసిన ఘనత యువన్ శంకర్ రాజాకే చెందుతుంది. తన పాటలు విన్నప్పుడు స్లోగా ఉన్నాయి అన్న వాళ్ళందరూ స్క్రీన్ పైన చూసాక ఈ పాటలు మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ఆయువుపట్టుగా నిలిచింది. నవీన్ నోలి ఎడిటింగ్ బాగుంది. అక్కడక్కడా చిన్న చిన్న బోరింగ్ సీన్స్ పై శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది. రామ్ లక్ష్మణ్ – పీటర్ హెయిన్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. డైలాగ్స్ కూడా కుటుంబకథకి తగ్గట్టుగా ఉన్నాయి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్న తరహాలో ఈయన లేకపోతే పైన చెప్పిన వాళ్ళెవ్వరూ ఉండరు. ఆయనే నిర్మాత బండ్ల గణేష్. కమర్షియల్ ఫార్మాట్ నుంచి పక్కకి వచ్చి ఇలాంటి కథని ఎంచుకొని, దానిలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకొని నిలబడి ఈ సినిమా చేసిన బండ్ల గణేష్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి అలాగే ఇలాంటి మూవీ మన తెలుగు వారికి అందించినందుకు థాంక్స్ చెప్పాలి. ఆయన పెట్టిన ప్రతి రూపాయి మనకు పదింతలుగా స్క్రీన్ పై కనిపిస్తుంది.
తీర్పు :
‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా తెలుగు ప్రేక్షకులు పది కాలాల పాటు మనసుకు హత్తుకునే సినిమాగా, రాబోవు తరాలకి కుటుంబ బాంధవ్యాల విలువను చాటిచెప్పే ఓ మరువలేని సినిమాగా తెలుగు చలన చిత్ర రంగంలో నిలిచిపోతుంది. రామ్ చరణ్ ఈ సినిమాతో తనలోని అసలైన నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేయడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ మనసులో కూడా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. చరణ్, కాజల్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, కమలినీ, జయసుధ ఇలా అందరూ అద్భుతమైన నటనని మరియు ఒకరితో ఒకరు మంచి కెమిస్ట్రీని పండించారు. ఈ సినిమా ద్వారా కృష్ణవంశీ చెప్పాలనుకున్న పాయింట్ ని ఎమోషనల్ గా ప్రతి ఆడియన్ కి కనెక్ట్ చేసాడు. ఇలాంటి ఓ అద్భుతమైన దృశ్య కావ్యాన్ని అందించిన ఈ చిత్ర టీంలోని ప్రతి ఒక్కరికీ హ్యాట్సాఫ్. దసరా కానుకగా వచ్చిన ఈ సినిమా కుటుంబసమేతంగా తప్పక చూడాల్సిన సినిమా కావున బాక్స్ ఆఫీసు వద్ద రికార్డులు తిరగరాస్తుందని చెప్పవచ్చు. కథా పరంగా కుటుంబ ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకుంటే, బావా మరదళ్ళ సరసాలు యువతని ఆకట్టుకుంటాయి. కావున ఈ సినిమాకి వెళ్ళిన ఎవరూ నిరాశాపడరు. నేటితరం వారంతా నాటితరం వారితో కలిసి చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమానే ఈ ‘గోవిందుడు అందరివాడేలే’.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రామ్ చరణ్ చెప్పినట్టుగానే 8వ సినిమా ఫ్లాప్ అనే ఫోభియాని ఈ ‘గోవిందుడు అందరివాడేలే’ తో బ్రేక్ చేసాడు.